కరోనా సంక్షోభం దెబ్బకు 2020 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో గృహాల ధరలు 3.6 శాతం తగ్గాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపె నీ నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడించింది. తత్ఫలితంగా, నైట్ ఫ్రాంక్ అంతర్జాతీయ ఇళ్ల ధరల సూచీలో భారత్ కనిష్ఠ (56వ) స్థానానికి జారుకుంది. ప్రపంచంలో అత్యంత పేలవ పనితీరు కనబర్చిన రియల్టీ మార్కెట్‌గా భారత్ నిలిచిందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు పేర్కొంది. ప్రపంచంలోని 56 కీలక రియల్టీ మార్కెట్లలో 30.3 శాతం ధరల పెరుగుదలతో టర్కీ ఈ సూచీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
2019 అక్టోబరు-డిసెంబరు కాలానికి మన దేశం 43వ స్థానంలో నిలిచింది. గత ఏడాది జనవరి-మార్చి కాలానికీ అదే స్థానంలో కొనసాగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 54వ స్థానానికి జారుకుని.. ఆపై మూడు నెలల్లోనూ అదే స్థానంలో కొనసాగింది. 2020 చివరి త్రైమాసికంలో సూచీ అధమ స్థానానికి పడిపోయింది.