కష్టజీవి నుంచి కలెక్షన్ కింగ్ వరకు.. ఆయన రూటే సెపరేటు!

0
1765

ఏ మ్యానరిజమ్ అయినా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నవరసాలను అవపోసన పట్టిన పరిపూర్ణ నటుడు. ఆయన డైలాగులు చెబుతుంటే.. కలెక్షన్లు వరదలే. అందుకే అయ్యారు ఆయన కలెక్షన్ కింగ్. దశాబ్దాల నటనానుభవంతో… వెండితెరపై ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడిగా, అప్పటికీ.. ఇప్పటికీ అదే స్టామినా, అదే ముక్కుసూటితనం, అదే మంచితనం.., అదే దానగుణం కలిసిన రూపమే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కష్టం విలువ తెలుసు కాబట్టే.. ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. మాటంటే మాటే. టైమంటే టైమే.. అందుకే సమయం కూడా ఆయనకు సలామ్ చేస్తుంది. నటరత్న నందమూరి తారకరామారావుకు తమ్ముడు, దర్శకరత్న దాసరి నారాయణరావుకు ప్రియ శిష్యుడు.. మేం టామ్ అండ్ జెర్రీ టైప్ అని చెప్పుకునే సహోదరుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రాణ మిత్రుడు.. తెలుగు ప్రేక్షకులు ఆరాధించే అద్భుత నటుడు వన్ అండ్ ఓన్లీ మంచు మోహన్ బాబు. మార్చి 19 మోహన్ బాబు పుట్టినరోజు. కష్టజీవిగా మొదలై.. ఇప్పుడందరి ఇష్టజీవిగా మారిన మంచు మోహన్ బాబుకి ఈ పుట్టినరోజు చాలా విశిష్టమైన రోజు. తన బిడ్డ మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘మోసగాళ్లు’ చిత్రం కూడా ఈరోజే విడుదలవుతుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి.. తన తండ్రికి బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వాలనే.. ఆశతో మంచు విష్ణు రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాడు.

ఇక మోహన్ బాబు నట జీవితంలోకి వెళితే.. భారతదేశం గర్వించదగ్గ నటులలో మోహన్ బాబు ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు మోహన్ బాబు. హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించినా.. మెయిన్ విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా.. మోహన్ బాబు చేయని పాత్రంటూ లేదు. సోషల్ మూవీస్ లోనే కాకుండా.. హిస్టారికల్, ఫోక్ లోర్, మైథలాజికల్ ఇలా.. అన్ని తరహా జానర్స్ లోనూ అదరగొట్టిన ఘనత మోహన్ బాబుది. నటుడిగా, నిర్మాతగా సత్తాచాటిన మోహన్ బాబు తెలుగు చిత్రసీమలో తిరుగులేని స్టార్ గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విలన్ నుండి టాప్ హీరోగా మారారు. మోహన్ బాబు డైలాగ్స్ కొడితే థియేటర్లు విజిల్స్ తో మార్మోగిపోయేవి. దశాబ్దాల సినీ జీవిత చరిత్ర కలిగిన మోహన్ బాబు ఎన్నో అవార్డులు రివార్డులను అందుకొని ఎన్నో రికార్డులను తిరగరాశారు.

గత దశాబ్ద కాలంగా ఆచితూచి అడుగులు వేసిన మోహన్ బాబు.. ఇకపై సినిమాల స్పీడు పెంచేలా కసరత్తులు చేస్తున్నారు. ఒకవైపు హీరోగా ‘సన్ ఆఫ్ ఇండియా’లో నటిస్తూనే.. ‘ఆకాశం నీ హద్దురా’ వంటి చిత్రాలలో క్యారెక్టర్స్ తోనూ మురిపిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’లో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్న కలెక్షన్ కింగ్, మరోవైపు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లోనూ ఓ కీలకపాత్రను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రానా దగ్గుబాటి నిర్మిస్తోన్న చిత్రంలోనూ మోహన్ బాబు నటిస్తున్నారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటే చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని ‘మహానటి’ సాక్షిగా అల్రెడీ ఆయన ఎప్పుడో హింట్ ఇచ్చేశారు. ఇప్పుడలాంటి పాత్రలతోనూ.. మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించడానికి రెడీ అవుతున్నారు మోహన్ బాబు. ఇకపై ఆయన స్పీడు ఏ రీతిన సాగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here