హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ఐపీఈ) 2021 ను జులై రెండో వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే ప్రింట్ అయి ఉండటంతో పరీక్షా విధానంలో ఎటువంటి మార్పు లేదంది. కాగా కొవిడ్ నేపథ్యంలో మూడు గంటల పరీక్షా సమయాన్ని 90 నిమిషాలకు కుదించింది. అంతేకాకుండా ప్రశ్నాపత్రంలో 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందంది. దీన్నే వంద శాతానికి పరిగణిస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రెండు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జులై మధ్య నుండి పరీక్షలను నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలను ప్రకటించవచ్చని తెలిపింది. కొవిడ్ లేదా ఇంకా ఏవైనా కారణాల వల్ల పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.