కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు ఫిలిప్పీన్స్ పోలీసులు విధించిన శిక్ష ఓ వ్యక్తికి మృతికి కారణమైంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన డారెన్ మనాగ్ (28) ఈ నెల ఒకటో తేదీన కర్ఫ్యూ సమయంలో మంచి నీటి కోసం బయటకు వచ్చాడు. రోడ్లపై తిరుగుతూ పోలీసులకు దొరికిపోయాడు. దాంతో వారు డారెన్ చేత 300 గుంజీలు తీయించారు.
అనంతరం ఇంటికి వచ్చిన డారెన్ తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడ్డాడు. తర్వాతి రోజు కూడా నడవలేకపోయాడు. కొద్ది గంటల తర్వాత కోమాలోకి వెళ్లాడు. ఆ తర్వాత గుండె ఆగిపోవడంతో చనిపోయాడు. ఆ విషయాలను డారెన్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఈ ఘటనపై ఫిలిప్పీన్స్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారెవరికీ తాము భౌతిక శిక్షలు విధించలేదని, కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చామని వివరణనిచ్చారు.