రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘రోజుకు 50 వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదు? కొన్ని రోజులుగా పరీక్షల సంఖ్య 20 వేల కంటే తక్కువ ఉండడానికి కారణమేంటి?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫలితాల్లో కచ్చితత్వం ఉండే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. కరోనా, లాక్‌డౌన్‌లతో ప్రజల ఇబ్బందులపై దాఖలైన వ్యాజ్యాల్లో రెండు వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
ఈ వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఫైల్‌లోకి తీసుకున్న ధర్మాసనం.. ‘‘పాఠశాలలు, కాలేజీలను ఇటీవల పునఃప్రారంభించారు. విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’’ అని ప్రశ్నించింది. ‘‘కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే వార్తలు వింటున్నాం. చాలా దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలంగాణ కూడా అందులో ఒకటిగా ఉండరాదు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది’’ అని స్పష్టం చేసింది. ‘‘పండుగలు, ఉత్సవాలు సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు గుమిగూడుతారు. అటువంటి చోట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఫంక్షన్ హాళ్ల వద్ద ఎలాంటి నిబంధనలను అమలు చేస్తున్నారు?’’ అని ప్రశ్నించింది.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను బస్సుస్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బోర్డర్స్‌లో స్ర్కీనింగ్ చేస్తున్నారా? అని ఆరాతీసింది. విమానాశ్రయాల నుంచి వచ్చేవారిని ఎలా పరీక్షిస్తున్నారని అడిగింది. ధర్మాసనం ప్రశ్నలకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ.. సీరో సర్వే మినహా కోర్టు ఇచ్చిన ఆదేశాలన్నీ పాటిస్తున్నామన్నారు. 300 మొబైల్ వాహనాలతో కరోనా పరీక్షలు చేస్తునట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో కొవిడ్-19పై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ)ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలిచ్చామన్నారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కొవిడ్-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఏప్రిల్ 6లోగా తాజా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మార్చి 16 నుంచి 31 వరకు 33 జిల్లాల వారీగా చేసిన ఆర్టీసీపీసీఆర్, యాంటీజన్ పరీక్షల వివరాలతో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కచ్చితత్వంతో ఫలితాలిచ్చే ఆర్టీపీసీఆర్ టెస్టులపై దృష్టిసారించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6కి వాయిదా వేసింది.